కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర చర్చమశనీయంగా మారిన కాకినాడ జిల్లా తుని సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneshwari Missing Case) ఆచూకీపై అధికారులను హోం మంత్రి అనిత (Home Minister Anita) ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి గాలింపు చర్యలను సమీక్షించారు. చిన్నారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ సిబ్బందితో కలిసి అధునాతన డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రికి ఎస్పీ వివరించారు. చిన్నారి ఆచూకీ కోసం నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కేసులో కీలకంగా ఉండి మృతిచెందిన పెంపుడు కుక్కకు ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. శనివారం అడవి అంతా గాలించి ఇంటికి వచ్చిన కుక్క.. అనూహ్యంగా సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందింది. కుక్క మృతికి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే చిన్నారి మిస్సింగ్ కేసుపై అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరా తీశారు. వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించుకోవాలని తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై శనివారం మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో సమీక్షించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో పవన్ మాట్లాడారు. బాలిక ఆచూకి కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్టు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్టు తెలిపారు.

