కలం, స్పోర్ట్ : హాకీ ఇండియా (Hockey India) లో అంతర్గత విభేదాలు, పరిపాలనాపరమైన సమస్యలు తీవ్రమవ్వడంతో సెప్టెంబర్ 18న అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, పాలకవర్గం మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడంతో పాటు హాకీ ఇండియా లీగ్‌ను స్వతంత్రంగా మార్చడంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత జట్టు జెర్సీ రంగును నీలం నుంచి కాషాయానికి మార్చడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈ మార్పు తన ప్రమేయం లేకుండా, ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి లేకుండా జరిగిందని హాకీ ఇండియా (Hockey India) అధ్యక్షుడు దిలీప్ తిర్కీ స్పష్టం చేశారు. దాంతో ఆయన డైరెక్టర్ జనరల్ ఆర్కే శ్రీవాస్తవకు షోకాజ్ నోటీసు ఇచ్చి, ఆయన బాధ్యతలను వెంటనే రద్దు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెక్రటరీ భోలానాథ్ సింగ్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఫ్రాంచైజీ యజమానులతో మాట్లాడి, లీగ్ నిర్వహణకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
లీగ్‌ను 40-60 శాతం భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌గా నడపాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో హాకీ ఇండియా ఎన్నికల తేదీలను ఖరారు చేయడంతో పాటు ఆర్థిక నివేదికలకు ఆమోదం తెలపనున్నారు. పంజాబ్, భోపాల్ లలో జరిగే ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కూడా చర్చించనున్నారు. సమస్యలను పరిష్కరించి, క్రీడా నిర్వహణను గాడిలో పెట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని భావిస్తున్నారు.
Also Read : భారత్‌లో పాక్ హాకీ టీమ్.. క్లారిటీ ఇదే!
Follow Us On: X(Twitter)

