కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ గ్యారెంటీలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని, చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ పథకాలనే కాపీ కొడుతున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీ పథకాలు ‘బ్లాక్‌బస్టర్’ విజయాన్ని సాధించాయని స్పష్టం చేశారు.
నవంబర్ లో జరిగే అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5000 డాలర్లు ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రస్తావించారు. తమ సంక్షేమ మోడల్, ఆలోచన విధానం ఇవాళ ప్రపంచం నలుమూలలకూ పరిచయం అవుతోందనడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనే నిదర్శమని అభిప్రాయపడ్డారు. గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ వంటి భారతీయ రాష్ట్రాలు కర్ణాటక మోడల్ ను అనుసరించాయని, తాజాగా ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు కూడా ఓటర్లకు ఆకట్టుకునేందుకు తమ మోడల్ ను కాపీ కొడుతున్నారని చెప్పుకొచ్చారు. కర్ణాటక సంక్షేమ పథకాలు గ్లోబల్ ట్రెండ్‌గా మారాయంటూ డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

