కలం, స్పోర్ట్స్ : భారత్‌లో జరిగే ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో (Mens Asian Champions Trophy 2026) పాల్గొనేందుకు పాకిస్థాన్ హాకీ జట్టు(Pakistan Hockey Team) సిద్ధమవుతోంది. అయితే ఆ జట్టు భారత్‌కు రావడం పూర్తిగా ప్రభుత్వ అనుమతిపైనే ఆధారపడి ఉంటుందని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ చీఫ్ మొహియుద్దీన్ అహ్మద్ వాని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జలంధర్, మొహాలీ వేదికలుగా జరగనుంది. భారత్, పాకిస్థాన్‌తో పాటు చైనా, జపాన్, మలేషియా, కొరియా జట్లు టోర్నీలో పాల్గొంటాయి. ఒమన్, బంగ్లాదేశ్‌లను రిజర్వ్ జట్లుగా ఉంచారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జలంధర్‌లో జరగనుండగా.. సెమీఫైనల్స్, ఫైనల్ మొహాలీలో నిర్వహించనున్నారు.
ఈ టోర్నీలో అందరి దృష్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంది. నవంబర్ 1న జలంధర్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అదే రోజు పంజాబ్ డే కావడంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేకపోయినా, బహుళ దేశాల టోర్నీల్లో రెండు జట్లు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వ విధానం అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుందా లేదా అన్నది ప్రభుత్వ నిర్ణయంతోనే తేలనుంది. గతంలో భారత్‌లో జరిగిన జూనియర్ వరల్డ్ కప్ నుంచి కూడా పాకిస్థాన్ జట్టు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను కారణంగా చూపుతూ వైదొలిగింది. దీంతో ఈసారి పాకిస్థాన్ భాగస్వామ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

