కలం వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నేడు మాజీ సీఎం కేసీఆర్(KCR)ను సిట్ అధికారులు విచారించనున్నారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఈ విచారణ జరుగనుంది. కేసీఆర్‌కు సిట్(SIT) నోటీసులు పంపించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్(BRS) పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కమిషనర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ హై అలర్ట్(High Alert) మెసేజ్ జారీ చేశారు.
కేసీఆర్ నివాసం వద్ద భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నేతలు గుమిగూడే అవకాశముందని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, సీఎం రేవంత్ దిష్టిబొమ్మల దహనం వంటి ఆకస్మిక నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాజకీయంగా మరింత ఉద్రిక్తం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయవచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సీపీలు, ఎస్పీలు, జాయింట్ సీపీలు, రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు.
పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు శాంతిభద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ సూచించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఆర్‌ఐఓలు నిరంతరం పర్యవేక్షించి వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ నేడు తెలంగాణ భవన్ వద్దకు రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో అన్ని జిల్లాల నుంచి నాయకులు తరలివస్తున్నారు. తెలంగాణ భవన్ లో 2,500 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రాల్లో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ఇటీవల సిట్ అధికారులు కేటీఆర్, హరీశ్ రావు విచారణ చేశారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. ఇక నేడు పార్టీ అధినేత కేసీఆర్ విచారణ, మరోవైపు పార్టీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


