కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజలు నదులు, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాల కారణంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తత తప్పనిసరి అని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, అలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
తల్లిదండ్రులు చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు పొలాల్లో పనులు చేయకుండా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని తెలిపారు. ప్రజల సహాయార్థం అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందన కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్ప్‌లైన్ నంబర్ 7989672511 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రజలు ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి సహాయం పొందాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు.

