కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా ఏనుకూరు, కామేపల్లి, వైరా, తల్లాడ, మణుగూరు, కరకగూడెం, చర్ల మండలాల్లో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో పెద్ద వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. దీని వల్ల పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతిన్నాయి. చర్ల, మణుగూరు మండలాల్లోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు రంగంలోకి దిగి పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు వర్షం పెద్ద ఊరటనిచ్చింది.

