కలం, వెబ్ డెస్క్: గోదావరిలో వరద పోతున్నా రిజర్వాయర్లు మాత్రం ఖాళీగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేయడం మానేసి.. తక్షణమే నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఎల్లంపల్లి వద్ద భారీగా వరద కిందకు వెళుతోందని.. మోటార్లు ఆన్ చేసి ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే అన్నపూర్ణ, రంగనాయక సాగర్ జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
50 టీఎంసీల మల్లన్న సాగర్‌లో ఇప్పుడు 13 టీఎంసీలే ఉన్నాయని హరీశ్ రావు (Harish Rao) వివరించారు. దీనిలో నీటిని నిల్వ చేస్తే హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీరుతాయన్నారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో 11 టీఎంసీలే ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ పూర్తి స్థాయిలో నిల్వ ఉంటే.. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎంతో లాభంగా ఉంటుందన్నారు. సిద్ధిపేట సమీపంలోని రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోడంతో దీని మీద ఆధారపడి పామాయిల్ సాగు చేసిన నర్మెట్ట ప్రాంత రైతుల మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు.
వెంటనే ప్రారంభించాలి..
ఎల్లంపల్లి నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయడం ప్రారంభించాలని హరీశ్ రావు సూచించారు. తద్వారా మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలు నిండుతాయన్నారు. వీటితో 5 లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరు అందడంతో పాటు తాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు. ఎల్ నినో సాకుగా చూపించడం మానుకోవాలని.. వరద ఉన్నందున 24 గంటలు మోటార్లు ఆన్ చేసి లిఫ్ట్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పిదాలకు రైతులను బలి పెట్టొద్దని సూచించారు.
Also Read: ఖైరతాబాద్ బైపోల్.. ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు
Follow Us On: X(Twitter)

