కలం, మెదక్ బ్యూరో: హన్మకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్‌ను మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.7,300 కోట్లు ఖర్చు చేసి 80శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. సాగునీటి ఆయకట్టును 47 వేల నుంచి 3.17 లక్షల ఎకరాలకు పెంచడమే కాకుండా, అవసరమైన 33 వేల ఎకరాల భూసేకరణలో ఇప్పటికే 30 వేల ఎకరాలను పూర్తి చేశామని తెలిపారు. మరో రూ.1,000 నుంచి రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తే మరో 2.40 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదని హరీశ్ రావు మండిపడ్డారు.
అలాగే రైతు భరోసా (Rythu Bharosa) ఆలస్యంపై సీఎం రేవంత్‌ను హరీశ్ రావు గట్టిగా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతుభరోసా ఇస్తామని చెప్పి, 20వ తేదీ వచ్చినా అతీగతీ లేదని మండిపడ్డారు. ‘‘రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా లేక కోతలు కోసేటప్పుడు ఇస్తారా?’’ అని ఆయన సెటైర్లు వేశారు. ఇప్పటికే రెండు పంటలకు పెట్టుబడి సాయం అందలేదని, ఈ సీజన్‌లోనైనా రైతులకు భరోసా కల్పిస్తారా లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
హామీల అమలుకు నిధులు కేటాయించాలి
ఈనెల 26న ప్రవేశపెట్టే బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించాలని హరీశ్ రావు అన్నారు. బడ్జెట్‌లో మహిళలకు నెలకు రూ. 2500 హామీ, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులందరికీ 4,000 పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట 37వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలన్నారు.


