కలం, నిర్మల్: ఎప్పుడూ రెవెన్యూ విధుల్లో తలమునకలయ్యే అధికారులు (Revenue Officials).. వినాయక నిమజ్జన వేడుకల్లో మాత్రం ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి ఘనంగా సాగనంపారు.
నిమజ్జన ఊరేగింపులో ఆర్డీవో రాథోడ్ రమేష్తో పాటు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డీజే పాటలు హోరెత్తుతుండగా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులతో నృత్యాలు చేశారు. విధుల్లో నిత్యం బిజీగా ఉండే అధికారులు సైతం నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది. అంతకుముందు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో నిర్మల్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది రూ.20 వేలతో లడ్డూను దక్కించుకున్నారు.

