కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కరువు పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. ముమ్మాటికీ ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు. సిద్దిపేట (Siddipet) జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. సిద్దిపేటలో ఆదివారం సాయంత్రం దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ నిర్వహించారు. జిల్లా ప్రజలతో పాటు, భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభకు తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిథిగా హరీశ్ రావు పాల్గొని సుదీర్ఘ ప్రసంగం చేశారు.
అయితే రద్దు.. లేదంటే వద్దు..
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. విద్యుత్ ఉత్పత్తి చేయలేక, మోటార్లు నడపడం చేతగాక రేవంత్ రెడ్డి తెచ్చిన కృత్రిమ కరువు అంటూ హరీశ్ రావు (Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1983లో ఎన్టీఆర్‌కు ఏ చేతితోనైతే దరఖాస్తు ఇచ్చారో, సీఎం అయ్యాక అదే చేతితో సంతకం పెట్టి సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. మూడేళ్ల పాలనలో సిద్దిపేటకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు కొట్టిపారేశారు. అయితే రద్దు.. లేదంటే వద్దు అన్నట్లుగా ప్రాజెక్టులను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
రైతులకు సీఎం క్షమాపణ చెప్పాలి..
సిద్దిపేట 1000 పడకల ఆసుపత్రి 95 శాతం పూర్తయిందని.. అయినా ఇప్పటికీ దానిని ప్రారంభించలేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ “సిద్దిపేటకు అంత పెద్ద ఆసుపత్రి ఎందుకు?” అని అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణా, గోదావరిల్లో పుష్కలంగా నీళ్లున్నా కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల మోటార్లు 24 గంటలు నడపకుండా పంటలను ఎండబెట్టాడని ఆరోపించారు. ఇందుకు భేషరతుగా రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మల్లన్నపై ఒట్టేసి మోసం చేశారు..
కొమురవెల్లి మల్లన్నపై ఒట్టేసి రైతు రుణమాఫీ చేస్తానని సిద్ధిపేట రైతులను మోసం చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 22 వేల మందికి మాఫీ అయితే, 24 వేల మందికి మొండిచేయి చూపించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి “పాత రోజులు తెస్తా” అని చెప్పి నిజంగానే 6 గంటల కరెంట్, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, ఎండిపోయే పంటలతో నాటి దుర్భర రోజులను మళ్లీ తెచ్చాడని విమర్శించారు. నాడు తెలంగాణ ఉద్యమానికి, కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దిపేటనే వేదికైందని కొనియాడారు. రేపు మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఈ గడ్డ నుంచే ఉద్యమం మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
Also Read : బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. విండీస్ చిత్తు
Follow Us On: X(Twitter)

