కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ స్టేడియంలో ‘హ్యాపీ సండేస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. నగర మేయర్ మమత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. హ్యాపీసండేస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ సిబ్బందిని అభినందించారు.
ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు వినోదంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కలుగుతుందన్నారు. హ్యాపీసండేస్ కార్యక్రమంలో ప్రారంభం నుంచి ఇప్పటివరకు పాల్గొన్న కళాకారులందరినీ సర్టిఫికెట్లు, మెమెంటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.
కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులతో బతుకమ్మ ప్రదర్శన, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, మ్యాజిక్ షో, యోగా ఆసనాలు, మిమిక్రీ ప్రదర్శనలు, సీనియర్ సిటిజన్ల నృత్య ప్రదర్శనలు, కరాటే విన్యాసాలు, వినూత్న సాహస ప్రదర్శనలు నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి, వారు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

