Mobile Popup Ad
Mobile Popup Ad

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026: జూన్ 9 నుంచి ఏపీఎల్ క్రికెట్ హంగామా

కలం, స్పోర్ట్స్ : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి క్రికెట్ పండుగ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సిద్ధమైంది. ఈ ఏడాది టోర్నమెంట్ జూన్ 9 నుంచి విశాఖపట్నం వేదికగా ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్ అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది ఏపీఎల్ సాధించిన అద్భుత విజయం తర్వాత, ఈ సారి మరింత ఉత్సాహంతో లీగ్‌ను తిరిగి తీసుకురావడం గర్వంగా ఉందని శివనాథ్ మీడియాకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సారి టోర్నమెంట్ షెడ్యూల్, నిర్వహణను గతానికంటే భిన్నంగా ప్లాన్ చేశారు. ఈ ఏడాది మ్యాచ్‌లు మొత్తం మూడు వేదికల్లో జరగనున్నాయి. విశాఖపట్నం, కడప,, రాజధాని ప్రాంతమైన అమరావతిలోని మంగళగిరిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి వేదికలోనూ ఆరు రోజుల పాటు మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ ముగింపు ఘట్టమైన ఫైనల్ మ్యాచ్‌కు మంగళగిరి వేదిక కానుంది. ఈ గ్రాండ్ ఫైనల్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సీజన్‌లో కూడా గత ఏడాది లాగే మొత్తం ఏడు జట్లు తలపడనున్నాయి. కొత్తగా ఎలాంటి జట్లను చేర్చలేదు. టోర్నీలో ప్రతి జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఎంతో మేలు చేసే ఈ టోర్నీకి మీడియా కూడా పూర్తి మద్దతు అందించి, మరింత విజయవంతం చేయాలని శివనాథ్ కోరారు. పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్లకు ఆయన అభినందనలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>