కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి (Bhadrachalam Temple) దివ్యక్షేత్రాన్ని అత్యంత వైభవంగా, దివ్యధామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంత రావు వెల్లడించారు. భద్రాచలం పర్యటనలో భాగంగా గురువారం ఆయన మొదటగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విస్తరణ, ప్రాంగణ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు కీలక సూచనలు చేస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ల మార్గదర్శకత్వంలో భద్రాద్రి క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 320 కోట్లను కేటాయించిందని, అందులో రూ. 270 కోట్లు కేవలం ప్రధాన దేవాలయ అభివృద్ధికి, మరో రూ. 50 కోట్లు గోదావరి స్నాన ఘాట్ల పునర్నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు వివరించారు. రాబోయే కాలంలో రానున్న వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శన ప్రణాళికలు, డిస్మాంటిల్ పనులు త్వరగా పూర్తి చేసి నిర్మాణాలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
పనుల నాణ్యతను, పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాన్ని ఇక్కడే అందుబాటులో ఉంచామని, సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు మంత్రులు 24/7 పనులను మానిటర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే, ఇంజనీరింగ్ దేవాదాయ శాఖల తరఫున వెంకటేశ్వరరావును ప్రత్యేకాధికారిగా నియమించి నిరంతర పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ప్రతి వారం ఈఓ స్థాయిలో, 15 రోజులకు ఒకసారి కమిషనర్ స్థాయిలో, నెలకు ఒకసారి మంత్రుల స్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 100 నుండి 200 సంవత్సరాల వరకు ఎలాంటి మరమ్మతులు అవసరం లేని విధంగా, అత్యంత పటిష్టంగా, నాణ్యతతో ఈ పనులను పూర్తి చేయాలని డైరెక్టర్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఈఎఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఈఓ దామోదర్, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

