కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సామాజిక న్యాయం కోసం, వెనుకబడిన తరగతుల (OBC) అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడు బీపీ మండల్ (BP Mandal) అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Hanumantha Rao)అన్నారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా మంగళవారం మహబూబ్‌నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ విప్ బీపీ మండల్ దేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన మహానేత అని కొనియాడారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు సమాన అవకాశాలు, విద్య, ఉద్యోగాల్లో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులను అధ్యయనం చేసి, వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలను సూచించేందుకు ఏర్పాటు చేసిన మండల్ కమిషన్ దేశ సామాజిక న్యాయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందన్నారు.
బీసీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీపీ మండల్ చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడమే బీపీ మండల్‌కు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, డిసిసి ప్రధాన కార్యదర్శులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బుద్దారం సుధాకర్ రెడ్డి, రాములు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య, కార్పొరేటర్లు ఉమర్ కొత్వాల్, ప్రశాంత్, రమేష్ రెడ్డి, పాతూరి రమేష్, తాహెర్, నాయకులు జహీర్ అక్తర్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, గోవింద్ యాదవ్, చందు యాదవ్, తిరుపతి నాయక్, మోయీజ్ , దోమ పరమేశ్వర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

