కలం, వరంగల్ బ్యూరో : జిల్లా (Hanumakonda)లో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఎలాంటి భయాందోళన చెందవద్దని హనుమకొండ (Hanumakonda) కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, పోలీస్, వివిధ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని వివిధ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గృహ వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందన్నారు.
ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఆశ్రమాలకు గ్యాస్ సరఫరాలో అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకునేందుకు 45 రోజుల వ్యవధి, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు వ్యవధి ఉంటే మాత్రమే గ్యాస్ రీఫిల్ బుకింగ్ కు అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై గ్యాస్ వినియోగదారులు, జిల్లా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) వస్తుందని, ఆ నెంబర్ ను వినియోగదారు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధికి తెలిపి గ్యాస్ రిఫిల్ తీసుకోవచ్చన్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
గ్యాస్ ఏజెన్సీల కన్స్యూమర్ నెంబర్ కు వినియోగదారులు ఫోన్ చేసినప్పుడు వెంటనే సానుకూలంగా ఏజెన్సీ సిబ్బంది స్పందించాలని అన్నారు. గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ నిల్వలు ఎప్పుడు ఉండేలా చూసుకోవాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడంలో గ్యాస్ ఏజన్సీల యాజమాన్యం సహకరించాలని కోరారు. బ్లాక్ మార్కెట్ కు గ్యాస్ సిలిండర్లను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీవోలు నారాయణ, రాథోడ్ రమేశ్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, డీఈవో గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, బీపీసీఎల్ వరంగల్ మేనేజర్ సాహిల్ ధోబ్లె, వివిధ సంక్షేమ అధికారులు నరసింహ స్వామి, ప్రేమకళా, నిర్మల పాల్గొన్నారు.

