రాజ్యాంగ స్ఫూర్తితో అణగారిన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలి: హనీఫ్ అహ్మద్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారత రాజ్యాంగం ఆమోదించబడిన ఈ పవిత్రమైన రోజు మన ప్రజాస్వామ్యానికి నిజాయితీ అద్దం లాంటిదని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ (Hanif Ahmed) అన్నారు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ అనే శ్లోకంలా చీకటి నుంచి వెలుగు వైపు నడిచే రక్షణ కవచమే రాజ్యాంగం అంటూ తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు .

దేశంలో బీసీలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీల జనాభా దాదాపు 90 శాతం వరకు ఉన్నప్పటికీ, వారి ఉనికి మాత్రం ఒకటి రెండు శాతానికి మించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమి, సంపద, విధానా నిర్ణయాల అధికారం, కీలక వ్యవస్థలలో పాత్ర ఇంకా సంపన్న వర్గాలు, ఆధిపత్య సామాజిక సమూహాల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ‘కంచె చేను మేసినట్టు’ కాకుండా, నీతి లేని అధికారం ఎల్లకాలం నిలవదనే సూక్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ‘ఎవరికెంతో వారికి అంత వాటా’ అనే లక్ష్యంతో దేశ ప్రజల్లో రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించాలని ఆయన పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లు లేదా కొన్ని సీట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఆధిపత్య కులాల పాత రాజకీయ ఎత్తుగడ అని, తేనె పూసిన కత్తిలా మాయమాటలతో, ఉపకులాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్లు వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ మోసాన్ని ఎదుర్కోవాలంటే మనకు మనం మేలుకోవాలి, చిత్తం శుద్ధి అయితే కృత్యానికి లోటు లేదు అన్నట్టుగా ఐక్యతతో నిలదీయాలని అన్నారు. భూమి, సంపద, శ్రమ, గౌరవం — వీటి పంపిణీలో సమతుల్యత లేకుండా ఏ సమాజమూ బలపడదనే సారాంశంతో మేధావులు, ఉద్యమకారులు, సామాజిక ఆలోచనాపరులు అణగారిన వర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి తాపత్రయపడుతున్నారని హనీఫ్ అహ్మద్ పేర్కొన్నారు.

ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టుగా ఫిర్యాదులతోనే ఆగిపోకుండా, చీకటిని తిట్టడం కంటే, ఒక చిన్న దీపం వెలిగించడం మేలు, అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అనే సూక్తులతో ఎవరికెంతో వారికి అంత వాటా సాధించే వరకు ఈ ప్రయాణం ఆగకూడదని పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకమైన ఉద్యమం, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో నిర్మాణాత్మకమైన మేలుకొలుపు, చైతన్యం తీసుకురావడమే మన అందరి బాధ్యత అని, ఆ పునాదిపై బలహీన వర్గాల ఐక్యత నిలిచిన రోజు అణగారిన వర్గాలు లబ్ధిదారులుగా కాకుండా చరిత్రను రాసే యజమానులుగా నిలబడతారని సామాజిక వేత్త, తెలంగాణ ఉద్యమకారుడు హనీఫ్ అహ్మద్ ఉద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>