కలం, కరీంనగర్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో అధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ, అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పేషెంట్ కు అనవసరమైన పరీక్షలు, ఇష్టం వచ్చినట్లు మందులు ఇస్తున్నారని.. వాటి ద్వారా రోగులకు ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు అ యొక్క కుటుంబానికి అదనపు భారం కూడ అవుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో విజిటింగ్ డాక్టర్స్ పేరుతో ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు వెయ్యడం ద్వారా సామాన్య ప్రజలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున హాస్పిటల్ దంద నడుస్తుందని.. పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్యం చేయించు కోవడం కష్టంగా మారిందని గుంజపడుగు మండిపడ్డారు. ఆసుపత్రి బిల్లులు వాళ్ళు వేసే బిల్లును చూస్తేనే గుండెపోటు వస్తుందని.. ఇంట్లో ఒక్కరూ ప్రైవేటు హాస్పిటల్ చేరితే కుటుంబం మొత్తం రొడ్డు మీద పడటమే అవుతుందన్నారు. వాళ్ళు వేసే బిల్లులు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయని చెప్పారు.
ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలను, హాస్పిటల్ లో సరైన మందులు, డాక్టర్లను, సిబ్బందిని పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది కానీ.. ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపించారు.
కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే.. ఎంత పెద్ద రోగం వచ్చిన ఆసుపత్రిలో ఒక్క రూపాయి చెల్లింపు లేకుండా ఉచిత వైద్యం పథకం అమలు చేసి తీరుతామని హరిప్రసాద్ తెలిపారు. ‘ఆరోగ్యం అనేది వ్యాపార వస్తువు కాదు, అది మానవతా దృక్పథంతో కూడిన సేవ. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ స్పందించి ప్రైవేట్ ఆసుపత్రులపై గట్టి నిఘా పెట్టి సామాన్యుడికి న్యాయం చేయాలని లేనిఎడల తెలంగాణ రక్షణ సేన ఆద్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తాం’ అని అన్నారు.

