కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Jogulamba Gadwal)మండలం గుంటిపల్లిలోని (Guntipalli) ఎంపీయూపీఎస్ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కె. విజయలక్ష్మి సందర్శించి.. పాఠశాల విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన స్థాయి, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా 3, 4, 5, 6వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని డిఈఓ స్వయంగా పరిశీలించి, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నట్లు గుర్తించారు. ఇదే స్థాయిని కొనసాగిస్తూ, మరింత మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో లైబ్రరీ, పిటిఎం రిజిస్టర్, విద్యార్థుల అసైన్మెంట్లు, ఎఫ్ఏ -1 రికార్డులు, మూవ్మెంట్ రిజిస్టర్, కిచెన్ గార్డెన్, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించి, అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ప్రమాణాల పెంపుదలకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ప్రత్యేక అవసరాలున్న (CwSN) విద్యార్థితో డిఈఓ ప్రత్యేకంగా మాట్లాడి, విద్యా ప్రగతి, అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో ఏర్పాటు చేసిన ర్యాంప్, రైలింగ్ సదుపాయాన్ని పరిశీలించి, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు, సురక్షితమైన పాఠశాల వాతావరణం కల్పించాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, అభ్యసన ఫలితాల మెరుగుదల, పాఠశాల నిర్వహణలో మరింత నాణ్యత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు.

