కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని ఏజెన్సీ, గిరిజన గూడేల ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.తుకారామ్ రాథోడ్ సూచించారు. శుక్రవారం పాల్వంచలో వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలు, ఆవాసాల్లో క్రమం తప్పకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని, సెలవు రోజుల్లోనూ అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాతా-శిశు సంరక్షణపై సమీక్షిస్తూ, హై-రిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రసవానికి కనీసం మూడు రోజుల ముందే హై-రిస్క్ గర్భిణీలను బర్త్ వేయిటింగ్ హోమ్‌లకు తరలించేలా ముందస్తు ‘బర్త్ ప్లాన్’ సిద్ధం చేసుకోవాలని సూచించారు. గర్భిణీలకు అనీమియా, హెపటైటిస్, హెచ్‌ఐవీ పరీక్షలు పూర్తి చేసి, తల్లి, శిశువు ఆరోగ్య రక్షణ కోసం సమతుల్య పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు.
అలాగే జిల్లాలో అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో భాగంగా బిపి, షుగర్ రోగులను గుర్తించి క్రమం తప్పకుండా ఉచిత పరీక్షలు, మందులు అందించాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశానికి ముందు డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ లక్ష్మీదేవిపల్లి మండలం పీహెచ్సీ రేగళ్ల పరిధిలోని ఆసుపత్రి (గట్టుమళ్ల) నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల లభ్యతను, గడువు ముగిసిన మందుల తొలగింపును పరిశీలించి, మలేరియా పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చికిత్స చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డాక్టర్లు,జిల్లా వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

