కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన, ఆదివాసీ రైతులకు (Podu Farmers) తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా సాగుదారులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య (Gummadi Narsaiah), సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించి, రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (PO)కి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఇంకా పట్టాలు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అటవీ అధికారులు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, దుమ్ముగూడెం, పినపాక మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న వారిని బలవంతంగా గెంటివేస్తూ ప్లాంటేషన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సాగుదారులను కాపాడలేకపోతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి, పాత కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్ద భిక్షం, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న, కెచ్చెల కల్పన, జాటోత్ కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

