కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్ (Rajasthan)లో ఒక పెళ్లి వేడుక ఊహించని మలుపు తిరిగింది. పెళ్లి పీటలపై ఉన్న వరుడు వరకట్నం కింద తనకు మహీంద్రా స్కార్పియో కారు కావాలని పట్టుబట్టాడు. వధువు తండ్రి తన ఆర్థిక ఇబ్బందులు వివరించి, కారు ఇవ్వడానికి కొంత సమయం కావాలని బతిమాలుకున్నాడు. అయినా వరుడు వినిపించుకోకుండా పెళ్లి మధ్యలోనే లేచి ఊరులోని పొలాల వెంట పరుగందుకున్నాడు. వరుడి వింత ప్రవర్తన చూసి పెళ్లికి వచ్చిన బంధువులు, గ్రామస్థులు అవాక్కయ్యారు. కొందరు బంధువులు బురద పొలాల్లో వరుడిని వెంబడించి పట్టుకొని పెళ్లి మంటపానికి తీసుకొచ్చారు.
ఈ గందరగోళం మధ్యన వధువు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మనుషుల కంటే మిషిన్లకే ఎక్కువ వాల్యూ ఇచ్చే వ్యక్తి తనకు వద్దంటూ పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, వరకట్న వేధింపుల కింద వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం ఒక కారు కోసం వరుడు పారిపోవడం, వధువు కుటుంబం అతడిని వెంటాడటం చూపి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వధువు తీసుకున్న నిర్ణయానికి ఆమెను మెచ్చుకుంటున్నారు.

