కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు నిత్య సాధన చేయాలని జిల్లా నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Collector Priyanka )సూచించారు. సివిల్స్ ,గ్రూప్ -1 పరీక్షలంటే భయ పడాల్సిన అవసరం లేదని, 9 వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న సైన్స్, మ్యాస్, సోషల్ పుస్తకాలలోని ప్రశ్నలే ఆయా పోటీ పరీక్షల్లో వస్తాయని, అందుకే ఇప్పుడే తరగతి గదుల్లో టీచర్లు చెప్పే పాఠ్యాంశాలను శ్రధ్ధగా విని, అర్థం కానీ సబ్జెక్టుల ను అడిగి నేర్చుకోవాలని ఆమె చెప్పారు. జిల్లా కలెక్టర్ శనివారం మరికల్ మండలం పస్పుల గ్రామానికి వెళ్లే మార్గంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని లైబ్రెరీ గదిని, స్టోర్ రూమ్ ను చూశారు.
స్టోర్ రూమ్ లో కూరగాయలు, పండ్లను, ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించారు. కూరగాయలు తాజాగా లేవని, సంబంధిత కాంట్రాక్టర్ కు చెప్పి తాజా కూరగాయలను సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారికి, ఆ పాఠశాల ఎస్. వో రాజ్యలక్ష్మి కి సూచించారు. పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్ళిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం కోసం వండిన అన్నం, సాంబారు, పప్పు, గుడ్లను పరిశీలించారు. మెనూ జాబితాను చూసి శనివారం మెనూలో కర్రీ కూడా ఉంది కదా అని వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా.. వంకాయ కర్రీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్ళిన కలెక్టర్ విద్యార్థినులతో ఇంట్రాక్ట్ అయ్యారు. అన్ని పాఠ్య, రాత పుస్తకాలు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ పాఠాన్ని విద్యార్థినులతో చదివించారు. భవిష్యత్ లో మీరేం కావాలని అనుకుంటున్నారని వారిని ఆమె ప్రశ్నించగా, చాలా మంది విద్యార్థినులు అగ్రికల్చర్ అధికారులం అవుతామని తెలిపారు.
పదో తరగతి పరీక్షలలో 550 కి పైగా మార్కులు ఎవరెవరు తెచ్చుకుంటారో చెప్పండి అని అడిగిన కలెక్టర్ కు మొత్తం తరగతి గదిలో ఉన్న విద్యార్థినులంతా చేతులెత్తి ధీమా వ్యక్తం చేశారు. చివరగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలలో పాఠశాల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి తాను ప్రత్యేక బహుమతి ఇస్తానని కలెక్టర్ ప్రకటించారు. గొప్ప గొప్ప లక్ష్యాల కోసం కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రణాళిక బద్ధంగా చదవాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్ కోటి, ఎంపీడీవో పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.

