కలం, కరీంనగర్ బ్యూరో: ఈ ఏడాది విజయ దశమి నాటికి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay) తెలిపారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. కరీంనగర్-వరంగల్ హైవే విస్తరణ పనులు పూర్తయ్యిన వెంటనే కరీంనగర్ – జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ హైవే విస్తరణకు సంబందించి టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. శనివారం సాయంత్రం జమ్మికుంట నుండి తిరిగివస్తూ కందుగుల చౌరస్తా వద్ద కరీంనగర్ – వరంగల్ హైవే జాతీయ రహదారి పనులను పరిశీలించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, బీజేపీ స్థానిక నేతలు సైతం కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. కేంద్ర మంత్రి రోడ్డు విస్తరణ పనుల పరిశీలనకు వస్తున్నారని సమాచారం అందుకున్న ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఉన్నతాధికారులు కందుగల వచ్చారు. కేంద్ర మంత్రిని కలిసి జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిని వివరించారు. కొత్తగట్టు, బొమ్మకల్, గట్టు దుద్దెనపల్లి వంటి చోట్ల కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, అవి మినహా 90 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మరో మూడు నెలల్లో విస్తరణ పనులను పూర్తి చేస్తామన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంతోపాటు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలోనూ రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యాలు మెరుగుపడి గ్రామాలు, పట్టణాలు, మండలాలు అభివ్రుద్ధి చెందుతాయన్నారు. అందులో భాగంగా ఏటా రహదారుల నిర్మాణానికి రూ.3 లక్షల కోట్లను మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అక్కడక్కడ కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ హైవే పనులు పూర్తయ్యిన వెంటనే కరీంనగర్ -జగిత్యాల రోడ్డ విస్తరణ పనులను ప్రారంభిస్తామన్నారు.

