కలం, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌లో వరి ధాన్య సేకరణ (Paddy Procurement) కోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, మార్క్ ఫెడ్ సిద్ధమవుతున్నాయి. ధాన్యాన్ని సేకరించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో చెల్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎంఎస్‌పీ (MSP) మేరకే మార్క్ ఫెడ్ కొనుగోలు చేయనున్నది. ఈసారి సీజన్‌కు దాదాపు 95 లక్షల టన్నుల మేర సేకరించే అవకాశమున్నట్లు పౌర సరఫరాల కార్పొరేషన్ అంచనా వేసింది. దీనికి తోడు భారత ఆహార సంస్థ (FCI)కు సరఫరా చేయడానికి కొత్త గోనె సంచుల కొనుగోలు సహా రవాణా ఛార్జీలకు మార్క్ ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్సీడీసీ (NDDC) నుంచి రూ. 22,700 కోట్లను రుణంగా తీసుకోవాలని ఈ రెండు సంస్థలు భావించాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండనున్నది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
తక్కువ వడ్డీకి షార్ట్ టర్మ్ లోన్ :
ప్రతీ సంవత్సరం రెండు సీజన్‌లకు ఎన్సీడీసీ నుంచి మార్క్ ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణం (Civil Supplies Corporation Loan) తీసుకోవడం ఆనవాయితీ. ఎఫ్‌సీఐకు ధాన్యాన్ని విక్రయించిన తర్వాత వచ్చే నిధులను తిరిగి ఈ రుణాన్ని చెల్లించడానికి వినియోగించడం ప్రతీ ఏటా కొనసాగే ప్రాక్టీస్. ఈసారి కూడా ఆ తరహాలోనే రూ. 22,700 కోట్ల రుణాన్ని మార్క్ ఫెడ్ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమకూర్చుకుంటున్నది. ఈ రుణానికి 2% మేర గ్యారంటీ కమిషన్, 0.125% చొప్పున సర్వీస్/హ్యాండ్లింగ్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్సీడీసీకి మార్క్ ఫెడ్ బకాయి ఉన్న రుణాలతో సంబంధం లేకుండా ఈ కొత్త రుణాలు సమకూరనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ధాన్య సేకరణ (Paddy Procurement) ప్రక్రియ షెడ్యూలు ఖరారుకు ముందే ఈ రుణం అందనున్నది.
Read Also: మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం
Follow Us On: Instagram

