కలం, వనపర్తి: మొల్లమాంబకు సముచిత గుర్తింపు కల్పించేలా వనపర్తి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆమె విగ్రహాలను (Mollamamba Statues) ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నాయకులు కోరారు. అలాగే కుమ్మర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, సంప్రదాయ వృత్తిని ప్రోత్సహించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం వీపనగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావును పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల కుమ్మర సంఘం ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాములు, గౌరవ అధ్యక్షుడు సూర్యవంశం వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆతుకూరి మొల్లమాంబ చరిత్రను భావితరాలకు పరిచయం చేసేలా మండల కేంద్రాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. తరతరాలుగా కుమ్మర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆధునిక పనిముట్లు, విద్యుత్‌తో పనిచేసే కుండల తయారీ యంత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
మట్టి నిల్వ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాలు కేటాయించడంతో పాటు ఆర్థిక సహాయం, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. కుమ్మర యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రోత్సాహం కల్పించాలని, సంఘాల అభివృద్ధికి, సామాజిక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, మూడు మండలాల సంఘం నాయకులు, సామాజికవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

