కలం, కరీంనగర్ బ్యూరో: భవన నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ముందుకు పోతుందని కరీంనగర్ (Karimnagar) సెంటర్ సంస్థ ఛైర్మన్ నల్ల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ సెంటరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు ఒకటి నుంచి రెండు రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలోని 6వ ‘బిల్డ్ ఎక్స్పో – 2026’ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇల్లు నిర్మించుకునేవారికి అవగాహన..
భవన నిర్మాణ దారులు, సామాన్య ప్రజలు నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను, పద్ధతులను ఉపయోగించి కొత్త నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన అవగాహన కల్పించడమే ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని నల్ల లక్ష్మయ్య తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు.
ఇల్లు నిర్మించుకునే సామాన్య ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తుల ఎంపిక, ఆధునిక నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. స్టీల్, సిమెంట్, పెయింట్స్, హార్డ్వేర్, ప్లైవుడ్, లామినేట్స్, లిఫ్ట్లు, వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్, ఎలక్ట్రికల్, శానిటరీ ఉత్పత్తులు, యూపీవీసీ విండోస్, పీటీ స్లాబ్ టెక్నాలజీతో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారు.
ప్రవేశం ఉచితమే..
ఆర్కిటెక్చర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నల్ల లక్ష్మయ్య కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉచితంగా సలహాలు, సూచనలు అందిస్తారన్నారు.
ఎక్స్పోకు ప్రవేశం ఉచితమని, సందర్శకులకు లక్కీ కూపన్లు కూడా అందజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎక్స్పో కన్వీనర్ పాక పావన కృష్ణ, సెక్రటరీ సబ్బని శ్రీనివాస్, స్పాన్సర్షిప్ కమిటీ హెడ్ వేల్పుల శ్రవణ్, కో-కన్వీనర్లు కోల అన్నారెడ్డి, గడ్డం హరికిషన్, కోశాధికారి వేణుమాధవ్, ప్రతినిధులు అనిల్, ప్రమోద్, రంజిత్ కుమార్, రాజగోపాల్, ప్రశాంత్, జీ.వెంకటకిషన్, గొల్లపల్లి వెంకటేష్, ఫణిందర్, జగదీష్, ప్రవీణ్ చారి, పి.ప్రశాంత్ పాల్గొన్నారు.

