కలం, వెబ్ డెస్క్ : కాకినాడలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య ఘర్షణ (Kakinada Clash) చోటుచేసుకుంది. ఒక మణిపూర్ విద్యార్థిని తన మొబైల్ ఫోన్ పోయిందంటూ సర్పవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. గతంలో జరిగిన ఒక ఫోన్ దొంగతనం ఘటనకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్‌కు చెందిన విద్యార్థినులకు, స్థానిక తెలుగు విద్యార్థినులకు మధ్య ఆరోపణలు, అపార్థాలు తలెత్తాయి.
ఈ గొడవ కాస్తా ముదిరి పరస్పరం తోపులాటలు, దాడికి దారితీసింది. హాస్టల్ ఆవరణలో విద్యార్థినులు కర్రలు, బకెట్లు, చీపుర్లతో కొట్టుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు విద్యార్థినులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు వెంటనే కళాశాలకు చేరుకుని విద్యార్థినులకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు మణిపూర్ విద్యార్థినులను వేరొక హాస్టల్‌కు తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పందిస్తూ, నర్సింగ్ కళాశాలలో తలెత్తిన చిన్నపాటి వివాదం పూర్తిగా పరిష్కారమైందని వెల్లడించారు. పోయిందనుకున్న మొబైల్ ఫోన్ ఇప్పటికే రికవరీ అయి సంబంధిత విద్యార్థినికి చేరిందని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు స్పష్టం చేశారు.

