కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కూడా కాలేదు. ఇప్పటికే ఖమ్మం (Khammam) జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మారారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు క్యాబినెట్లో కీలకశాఖల్లో ఉన్న విషయం తెలిసిందే. వారి ఒత్తిడే కలెక్టర్ల బదిలీకి ప్రధాన కారణమా? ఇప్పుడు జిల్లాలో ఇదే టాపిక్‌గా మారింది.
వెంటవెంటనే బదిలీలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో (2023 డిసెంబర్) వీపీ గౌతమ్ ఖమ్మం కలెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆయన జూన్ 2024 వరకు ఖమ్మం కొనసాగారు. తర్వాత ముజమ్మిల్ ఖాన్ జూన్ 16, 2024న ఖమ్మం కలెక్టర్‌గా నియమితులయ్యారు. సుమారు ఏడాదిపాటు సేవలందించి జూన్ 2025లో బదిలీ అయ్యారు. అనుదీప్ దురిశెట్టి జూన్ 13, 2025న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి 10 నెలలు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీఎస్ దివాకర్, ఏప్రిల్ 27న ఖమ్మం కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసింది. వీసీ గౌతమ్ ఆరునెలల్లో, ముజిమ్మల్ ఖాన్ ఏడాదిలో, అనుదీప్ దురిశెట్టి 10 నెలల్లో బదిలీ కావడం గమనార్హం.
ఎందుకింత తొందరగా ట్రాన్స్‌ఫర్
సాధారణంగా కలెక్టర్లు మూడేళ్లు ఒకే జిల్లాలో పని చేస్తే, ఆ జిల్లా పై పట్టు సాధించి, జిల్లా అభివృద్ధికి బాటలు వేయడానికి అవకాశం ఉంటుంది. కలెక్టర్‌లను మూడేండ్లవరకు ఒక్క చోటనే ఉంచితే పాలనలో స్థిరత్వం ఏర్పడుతుందని సిబ్బంది వ్యవహారాలశాఖ మార్గదర్శకాలు చెప్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారులను ఎప్పుడైనా బదిలీ చేసే అధికారం ఉంటుంది. ఈ అధికారం వల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్లను ఇష్టా రీతిన బదిలీ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మంత్రుల కోపమే కారణమా?
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఎవరికీ కోపం వచ్చిన కలెక్టర్ మారుతున్నాడనేది ప్రస్తుతం జిల్లా ప్రజల నోట వినిపిస్తున్న మాట. మిగతా ఇద్దరు కలెక్టర్లపై పెద్దగా ఆరోపణలు రానప్పటికీ, మొన్న బదిలీ అయిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుదీప్ కలెక్టర్ గా ఉన్నప్పుడే వెలుగుమెట్ల కూల్చివేతలు జరిగాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అలాగే ఖమ్మం అభివృద్ధిలో భాగంగా, రోడ్ల విస్తరణ చేపట్టడం, ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణ చర్యలు వివాదాస్పదంగా మారాయి.
అనుదీప్ బదిలీ అందుకేనా?
ఈ కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఆర్డీఓను ప్రభుత్వం అప్పుడే బదిలీ చేయగా తహసీల్దార్ కూడా ఈ మధ్య బదిలీ అయ్యాడు. చివరగా కలెక్టర్ కూడా శనివారం బదిలీ అవ్వడంతో స్థానికుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. వెలుగుమెట్ల విషయంలో అధికారుల దుందుడుకు చర్య వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఈ చెడ్డ పేరును సరిదిద్దుకోవడానికి ముగ్గురు మంత్రులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులపై బదిలీ వేటు పడుతుందని జిల్లా ప్రజలు, రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మరో రెండున్నరేళ్లూ అధికారంలో ఉండనున్న నేపథ్యంలో ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన దివాకర్ ఎన్ని నెలలు ఉంటారో వేచి చూడాల్సిందే.

