కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి (91) (Bhuwan Chandra Khanduri) కన్నుమూశారు. సుదీర్ఘ అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీజేపీ సీనియర్ నేతగా 2007 నుంచి 2009, తిరిగి 2011 నుంచి 2012 వరకు ఖండూరి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయగా.. 2011లో ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిగా పార్టీ నియమించింది. కేంద్రమంత్రిగా కూడా ఖండూరి పనిచేశారు. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో ప్రముఖ నేతగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఖండూరి మరణంతో ఆ రాష్ట్రంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
చంద్ర ఖండూరి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా, ఆ తర్వాత రాజకీయరంగంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని కొనియాడారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

