ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ విధానాల వల్లే కరువు: నిరంజన్ రెడ్డి ఫైర్

కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో కరువు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) విమర్శించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి (Wanaparthy) జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో వర్షాలు పడవని, రైతులు పంటలు వేయొద్దని ప్రభుత్వం ప్రచారం చేయడం విచారకరమన్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి కొరత ఉందనే భ్రమను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాలతో కృష్ణా, తుంగభద్ర, భీమా నదుల్లోకి తగినంత నీరు వస్తుందని తెలిపారు.

తుంగభద్ర నుంచి శ్రీశైలానికి సుమారు 400 టీఎంసీల నీరు చేరుతుందని, అందువల్ల సాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. ఎల్లూరు కాలువ పరిధిలోని 19 నియోజకవర్గాలకు కేవలం 9 టీఎంసీల నీరే అవసరమని, వచ్చే జూన్ వరకు మిషన్ భగీరథ తాగునీటికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఆలమట్టి, నారాయణపుర ప్రాజెక్టుల్లో గణనీయమైన నీటి నిల్వలు ఉన్నాయని, కర్ణాటకలో లక్షల ఎకరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందన్నారు.

జూరాలకు భారీ వర్షాలు లేకపోయినా తుంగభద్ర నుంచి వరద ప్రవాహాలు వస్తాయని, జూరాల కాలువలకు ఈ సీజన్‌లో తప్పనిసరిగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా రూపొందించామని, పనులు దాదాపు 90 శాతం పూర్తయినా రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతులు నీళ్లు అడిగే వరకు వేచి చూడకుండా ముందుగానే సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నీటి సమస్యపై అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించేవారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వరద వచ్చిన మూడు రోజుల తర్వాతే పంపులు ప్రారంభించారని, ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో నడిపి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు సాగునీటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ఆందోళన ప్రకటించగానే అధికారులు తొందరపడి కాలువలకు నీరు విడుదల చేశారని విమర్శించారు. రైతులకు సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని, లేకపోతే రైతాంగం సహించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>