కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.ఎస్.డి.పి. అప్పల నరసింహరాజు (Appala Narasimha Raju) (82) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలోని స్వగృహంలో ఈ తెల్లవారుజామున మరణించారు. భీమునిపట్నం నియోజకవర్గం నుండి వరుసగా 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు విశేష సేవలు అందించారు. నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ గల నాయకుడిగా పేరున్న ఆయన మరణం టిడిపికి పెద్ద లోటుగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.

