కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ హల్చల్ చేసిన వ్యక్తి బండారం బయటపడింది. పోలీస్ యూనిఫామ్ ధరించి సెక్రటేరియట్ ప్రాంగణంలో వీడియోలు చిత్రీకరించిన నిఖిల్ అనే యువకుడు అసలు పోలీసే కాదని (fake police) తేలింది. పాతబస్తీలో ఖాకీ దుస్తులు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ముఖ్యమంత్రిని కలిపిస్తానని, ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తానని నమ్మిస్తూ అతను చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిఖిల్ పై గతంలోనే ఆంధ్రప్రదేశ్ లో పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం అందుతోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయంలోకి ఒక సామాన్యుడు పోలీస్ వేషంలో వెళ్లి వీడియోలు తీస్తుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ప్రత్యక్షమై చర్చకు దారితీసే వరకు అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. గతంలో కూడా నకిలీ గుర్తింపు కార్డులతో కొందరు సచివాలయంలోకి ప్రవేశించిన ఘటనలు ఉండటంతో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిఖిల్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

