కలం, మెదక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సిద్దిపేట (Siddipet) జిల్లా కాంగ్రెస్ (Congress) లో వర్గపోరు ఫ్లెక్సీల రూపంలో బయటపడింది. సీఎం పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. ఆంక్షా రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలలో ఎక్కడా హరికృష్ణ ఫొటో కనిపించలేదు. అదే విధంగా ఇంచార్జ్ హరికృష్ణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఫొటో లేదు. అధ్యక్షురాలి ఫొటో లేకపోయినా హరికృష్ణ ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫొటోలు పెట్టుకున్నాడు.
గతంలో డీసీసీ పదవుల కోసం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుమార్తె ఆంక్షా రెడ్డి, పూజల హరికృష్ణ పోటీపడ్డారు. డీసీసీ పోస్టు ఆంక్షా రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్‌లోని ఓ వర్గం అసంతృప్తితో ఉన్నది. కొంతమంది సీనియర్ నేతలు సిద్దిపేట జిల్లా డీసీసీ, సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయంగా మారింది. దీంతో ఏ ఫ్లెక్సీలలో ఎవరు ఉన్నారు? ఎవరు మిస్ అయ్యారో అని కాంగ్రెస్ నాయకులు చెక్ చేసుకుంటున్నారు. ఫ్లెక్సీ వార్, తాజా పరిణామాలతో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.

