కలం, వెబ్ డెస్క్: కన్న తండ్రే కసాయి తండ్రిగా మారిన దారుణ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గుడిమల్కాపూర్ (Gudimalkapur) ప్రాంతంతో వెలుగు చూసింది. భార్యపై ఉన్న కోపంతో ఓ తండ్రి తన కొడుకుపై అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ (22) అనే వ్యక్తికి తన భార్యతో గొడవ జరిగింది.
ఈ క్రమంలో తన భార్యపై ఉన్న కోపాన్ని కొడుకు అర్మాన్ (4)పై ప్రదర్శించాడు. PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 దగ్గరకు కొడుకుని తీసుకెళ్లి తలను పిల్లర్‌కు బలంగా కొట్టి, అనంతరం పైకి ఎత్తి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా లారీ కిందకు అర్మాన్ ను నెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే సల్మాన్ ను అడ్డుకోవడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఇక తీవ్రంగా గాయపడిన బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు సల్మాన్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సమాచారం అందిన గంట తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

