కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తీవ్ర విమర్శలు గుప్పించారు. పేరుకు పలకరింపులు, విజిట్ అంటారే తప్ప జగన్‌ది అంతా అరాచకమేనని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేవని పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్నట్లు జగన్ సరికొత్త డ్రామాలకు తెరలేపారని పేర్కొన్నారు.
పొగాకు రైతులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పొగాకు రైతుల కోసం అసలు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పొగాకు రేట్ల హెచ్చుతగ్గులకు అనేక కారణాలుంటాయని, ఆ మాత్రం జగన్‌కి తేలిదా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే 2019 నుంచి 2024 మధ్య కాలంలో పొగాకు రేట్లపైనా చర్చిద్ధామని జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. నేరుగా అయినా, ఆన్‌లైన్ అయినా సరే చర్చకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

