కలం, జోగుళాంబ గద్వాల: ధరూర్ మండలం నెట్టెంపాడు(Nettempadu) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు (Electric Shock) గురై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెట్టెంపాడు గ్రామానికి చెందిన కుర్వ ఈశ్వరయ్య తన వ్యవసాయ పొలంలో సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో రైతుకు చెందిన పొలంలోని ఇనుప కంచెను ప్రమాదవశాత్తు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
వ్యవసాయ మోటార్‌కు సంబంధించిన విద్యుత్ వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాగు పనులలో నిమగ్నమైన ఈశ్వరయ్యకు విషయం తెలియక కంచెను తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మృతుడు ఈశ్వరయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ధరూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

