కలం, వరంగల్ బ్యూరో: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం నర్సంపేట నియోజకవర్గంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఉద్యమ యోధుడిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.
నర్సంపేటలో ఆందోళన వాతావరణం
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన నాటి నుంచి నర్సంపేటలో ఆందోళన వాతావరణం నెలకొంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఆయన ఆరోగ్యంపైనే చర్చ సాగుతోంది. “పెద్దన్న త్వరగా కోలుకోవాలి.. మళ్లీ మా మధ్యకు రావాలి” అనే ఒక్కటే ప్రార్థన ప్రతి కార్యకర్త నోట వినిపిస్తోంది. నర్సంపేట నియోజకవర్గంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు ఆలయాల్లో అభిషేకాలు చేయిస్తుండగా, మరికొందరు ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు నిర్వహిస్తూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.
ఉద్యమం నాటి స్మృతులు..
తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటూ పలువురు ఉద్యమ సహచరులు భావోద్వేగానికి లోనవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమాన్ని గ్రామగ్రామానికీ తీసుకెళ్లిన రోజుల నుంచి, అరెస్టులు, నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి నడిచిన కార్యకర్తలు “మాకు ఆయన నాయకుడు మాత్రమే కాదు.. కుటుంబ పెద్ద” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భావోద్వేగ పోస్టులు..
సోషల్ మీడియా వేదికగా కూడా భావోద్వేగ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. “పెద్దన్న తిరిగి రావాలి”, “త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలి”, “ఉద్యమ యోధుడు మళ్లీ నవ్వుతూ కనిపించాలి” అంటూ వేలాది మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆయనతో దిగిన పాత ఫొటోలు, ఉద్యమ జ్ఞాపకాలను పంచుకుంటూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నర్సంపేట ప్రజలతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ అదే చిరునవ్వుతో ప్రజల మధ్యకు రావాలని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నర్సంపేట నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు “పెద్దన్న… మీరు తప్పకుండా ఈ పోరాటంలోనూ గెలవాలి. మళ్లీ మా మధ్యకు రావాలి” అని ఒక్కటే నినాదం వినిపిస్తోంది.

