కలం, స్పోర్ట్స్ : తైపీ ఓపెన్ (Taipei Open) సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. హెచ్‌ఎస్ ప్రణయ్, ఉన్నతి హూడాతో పాటు పలువురు భారత ఆటగాళ్లు తొలి రౌండ్‌లో విజయాలు సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన హెచ్‌ఎస్ ప్రణయ్, జపాన్‌కు చెందిన మినోరు కోగాపై 21-11, 21-14తో వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించిన ప్రణయ్, రెండో రౌండ్‌లో హాంకాంగ్‌కు చెందిన జేసన్ గునవాన్‌ను ఎదుర్కొంటాడు. జేసన్ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు మిథున్ మంజునాథ్‌ను ఓడించి ముందుకు వచ్చాడు.
భారత్‌కు చెందిన కిరణ్ జార్జ్ కూడా చైనీస్ తైపీ ఆటగాడు వాంగ్ పో-వేపై 21-10, 21-18తో గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. మరో భారత షట్లర్ తరుణ్ మన్నేపల్లి సంచలన ప్రదర్శనతో కొరియాకు చెందిన ఎనిమిదో సీడ్ జియోన్ హ్యోక్ జిన్‌ను 21-12, 21-15తో ఓడించాడు. రెండో రౌండ్‌లో కిరణ్ జార్జ్, తరుణ్ మన్నేపల్లి ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. అయితే క్వాలిఫయర్స్ నుంచి మెయిన్ డ్రాలోకి వచ్చిన రౌనక్ చౌహాన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఇండోనేషియాకు చెందిన రిచీ డుటా రిచార్డో చేతిలో 14-21, 16-21తో పరాజయం పాలయ్యాడు.
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ ఉన్నతి హూడా తన ప్రచారాన్ని విజయంతో ప్రారంభించింది. చైనీస్ తైపీకి చెందిన పెయ్ యు వాంగ్‌ను 21-12, 21-18తో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో భారత షట్లర్ తన్యా హేమంత్‌తో తలపడనుంది. తన్యా తొలి రౌండ్‌లో వెన్ చీ హ్సూపై 21-16, 14-21, 21-16తో గెలిచింది. దేవికా సిహాగ్ కూడా అద్భుత పోరాటంతో కొరియాకు చెందిన గా యున్ పార్క్‌ను మూడు గేమ్‌లలో ఓడించి ముందంజ వేసింది. తన్వీ శర్మ, తస్నీమ్ మీర్‌పై 21-16, 22-20తో విజయం సాధించగా, అన్మోల్ ఖర్బ్ అమెరికాకు చెందిన ఇషికా జైస్వాల్‌ను 21-15, 11-21, 21-19తో మట్టికరిపించింది. రెండో రౌండ్‌లో దేవికా ఇండోనేషియాకు చెందిన ని కడెక్ ధిందా అమర్త్య ప్రతీవిని ఎదుర్కొననుండగా, తన్వీ శర్మ తాలితా రమధాని విర్యవాన్‌తో తలపడనుంది. అన్మోల్ ఖర్బ్‌కు మాత్రం కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆమె రెండో సీడ్ హ్సియాంగ్ టి లిన్‌తో పోటీ పడనుంది. మరోవైపు అశ్మిత చలిహా, శ్రీయాంశి వాలిశెట్టి తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. ఇషారాణి బరువా తన తొలి మ్యాచ్‌ను తర్వాత ఆడనుంది.

