భారీ వర్షాల హెచ్చరిక.. భద్రాద్రి జిల్లా హైఅలర్ట్

కలం, ఖమ్మం బ్యూరో: రానున్న 36 గంటలలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) బుధవారం సంబంధిత శాఖల అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఎవరూ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లవద్దని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో 24 గంటలూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

వరద ముంపు ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను వెంటనే గుర్తించి, అక్కడి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నదులు, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులు లేదా కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినా ఆసుపత్రులలో  వైద్య సేవలు కొనసాగేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని వైద్యశాఖకు సూచించారు. ప్రసవ సమయం సమీపించిన గర్భిణీలను ముందుగానే సమీప ఆసుపత్రులు లేదా సురక్షిత కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా శాఖకు, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు అవసరమైన సూచనలు రైతులకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>