కలం, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి(Kukatpally)లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోతే అతడి కుటుంబ సభ్యులు ఇంట్లోనే నాలుగు రోజుల పాటు మృతదేహాన్ని ఉంచుకుని ప్రార్థనలు చేశారు. ఏసుప్రభు బతికిస్తాడని మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకోవడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని వివేకానందనగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్నది. తల్లి శమంతకమణి తన ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో ఇంట్లో ఉంటున్నారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన కుమార్తె శైలజను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు, యేసుప్రభు కృపతో ఆమె తిరిగి ప్రాణం పొందుతుందని నమ్మి ఇంటి తలుపులు మూసుకుని ప్రార్థనలు చేశారు.
ఇలా నాలుగు రోజులపాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచడంతో అపార్ట్‌మెంట్‌లో తీవ్ర దుర్వాసన వ్యాపించింది. అనుమానం వచ్చిన స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిపించి పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇవ్వడానికి మొదట నిరాకరించినప్పటికీ, పోలీసులు స్థానికులు పలుమార్లు నచ్చజెప్పడంతో చివరకు వారు ఒప్పుకున్నారు. అనంతరం అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని వారి స్వగ్రామమైన కైకలూరుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు.


