ఐపీఎల్‌లో రిషభ్ పంత్‌పై తీవ్ర‌ ఒత్తిడి: డుప్లెసిస్

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) కొత్త సీజన్‌కు ముందు రిషభ్ పంత్‌ (Rishabh Pant)పై భారీ ఒత్తిడి ఉందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) అభిప్రాయపడ్డాడు. రూ.27 కోట్ల భారీ ధరతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయని అన్నాడు. ‘‘గత సీజన్ పంత్‌కు అంతగా కలిసిరాలేదు. 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 24.45గా నమోదైంది. చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ మొత్తం సీజన్ ప్రదర్శన నిరాశపరిచింది. జట్టు పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదు. లక్నో 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది’’ అని గుర్తు చేశాడు.

ఈ పరిస్థితుల్లో కొత్త సీజన్‌లో పంత్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. భారీ ధరతో వచ్చిన ఆటగాళ్లపై అంచనాలు సహజంగా పెరుగుతాయని కూడా ఆయన పేర్కొన్నాడు. ఇదే చర్చలో మాజీ భారత క్రికెటర్ సురేష్ రైనా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేయాలని సూచించాడు. పంత్‌ను మూడో స్థానంలో, నికోలస్ పూరన్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని ఆయన సూచించాడు.

పూరన్ గత సీజన్‌లో మూడో స్థానంలో బాగా రాణించాడని, భారీ లక్ష్యాలను ఛేదించాల్సిన సందర్భాల్లో బ్యాటింగ్ ఆర్డర్‌లో చిన్న మార్పులు అవసరమవుతాయని రైనా అభిప్రాయపడ్డాడు. కొత్త ఐపీఎల్ సీజన్‌లో పంత్ ప్రదర్శన ఎలా ఉంటుందో అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>