కలం, ఖమ్మం బ్యూరో: వృద్ధులు కుటుంబానికి బరువు కాదని, వారి అనుభవాలు, జ్ఞానం సమాజానికి ఎంతో బలమని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యాచందన అన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో డీఆర్‌డీఎ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వృద్ధుల సంక్షేమం, భద్రత, గౌరవం కల్పించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వృద్ధుడికీ చేరేలా అధికారులు, సెర్ప్ సిబ్బంది, ఎస్‌హెచ్‌జీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వృద్ధులపై నిర్లక్ష్యం, వేధింపులు లేకుండా కుటుంబ సభ్యులు శ్రద్ధ వహించాలన్నారు. వారికి అవసరమైన చట్టపరమైన, వైద్య సహాయం అందేలా చూస్తామని తెలిపారు. అనంతరం వృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్‌ఏ కార్యదర్శి రాజేందర్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత, డీఈఓ శంభు ప్రసాద్, డీపీఓ అనూష పాల్గొన్నారు.

