కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నదని, రానున్న రోజుల్లో సంక్షోభం ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సాధ్యమైన చోట విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా, డిమాండ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఒక్క చుక్క వృథా కావొద్దు
భవిష్యత్తులో తాగు నీటి సమస్య తీవ్రతరం కాకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి.. తాగునీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి, దాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు సీఎంవో ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
దసరా తర్వాత అవగాహన కార్యక్రమాలు
ఎల్ నినో ప్రభావంతో తలెత్తే సంక్షోభాన్ని కరోనా తరహా ప్లాన్‌తో ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యలు తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే వాటిని గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ‘‘ప్రతి దశలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలి.
సినిమా, మీడియా, కళారూపాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ఎల్ నినో ప్రభావం, నీరు–విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టి, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి” అని దిశానిర్దేశం చేశారు. దసరా తర్వాత నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రులతో సమావేశం
ఆదివారం జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఎల్ నినోపై చర్చించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ‘‘రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో కరువు మండలాల ప్రకటన, కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోసం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరాం. వీబీ-జీ రాంజీ పథకంలో భాగంగా 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల పని దినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరాలి. అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.
కరోనా తరహా ప్లాన్
రాబోయే 8 నెలలు కీలకమని, వచ్చే ఏడాది జూన్ వరకు తాగు, సాగు నీళ్లు, విద్యుత్ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసి.. కరోనా తరహాలో సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీబీ-జీ రాంజీ పథకంలో అదనంగా 50 రోజుల పని దినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించేందుకు వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు.

