కలం, భువనగిరి: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని భువనగిరి లోక్‌సభ సభ్యులు (Bhuvanagiri MP), కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన మండిపడ్డారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల గురించి మాట్లాడినట్లుగా తన వీడియో, వాయిస్‌ను టాంపరింగ్ చేసి, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న ఆస్తులను, వారి అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెడుతుంటే చూసి ఓర్చుకోలేకనే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తన వాయిస్ లేదా వీడియోలను ఎవరు టాంపరింగ్ చేసినా, మార్ఫింగ్ చేసి ప్రచారం చేసినా ఉపేక్షించేది లేదని, బాధ్యులందరిపైనా చట్టపరంగా కేసులు నమోదు చేయిస్తామని కిరణ్ రెడ్డి హెచ్చరించారు. తాను కాంగ్రెస్ ఎంపీగా, పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా కీలకంగా వ్యవహరిస్తుండటం వల్లే తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పుల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి పక్కన పెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందని, అయితే కల్పిత వీడియోలతో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలే శిక్షిస్తారని, ఇప్పటికైనా బీఆర్ఎస్ చౌకబారు సోషల్ మీడియా రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

