కలం, నల్లగొండ: టీజీపీఎస్సీ (TGPSC) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ డీవైఎఫ్‌ఐ (DYFI) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నల్లగొండ జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.దశరథ్‌కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ (Mallam Mahesh) మాట్లాడుతూ.. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుండి రూ.1000కి పెంచడం యువతపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని అన్నారు.
ఇప్పటికే నిరుద్యోగులు కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు తదితర వ్యయాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఫీజుల పెంపు వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు గుణాలపురి బాలరాజు, బూర్గు గోపి, లింగరాజు, సాయి పాల్గొన్నారు.

