డాక్టర్ల సమయస్ఫూర్తికి సలామ్.. యువతికి తప్పిన ప్రాణాపాయం

​కలం, ఖమ్మం బ్యూరో: ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. సకాలంలో తీసుకునే సరైన నిర్ణయం నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడుతుందని మణుగూరు, భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య బృందాలు నిరూపించాయి. పక్షవాతానికి గురైన యువతికి, అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో అత్యాధునిక వైద్యం అందించి ప్రాణాపాయం తప్పించారు. ​మణుగూరుకు చెందిన రజని (29) అనే యువతికి శనివారం అకస్మాత్తుగా మాట తడబడటం, కుడి చేయి, కాలు పూర్తిగా చచ్చుబడిపోవడం వంటి పక్షవాత (స్ట్రోక్) లక్షణాలు కనిపించాయి.

భద్రాచలంలో అంతా సిద్ధం చేసి..

కుటుంబ సభ్యులు ఆలస్యం చేయకుండా రజనిని మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి కుమార్ పరిశీలించి, సమస్య తీవ్రతను వెంటనే గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం సీటీ స్కాన్, ఐసీయూ సదుపాయాలు అందుబాటులో ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తక్షణమే తరలించాలని నిర్ణయించారు. మణుగూరు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రామకృష్ణ ముందస్తుగా భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజస్వి గద్దెతో ఫోన్‌లో మాట్లాడి రోగి పరిస్థితిని వివరించారు.

దీంతో భద్రాచలం ఆసుపత్రి వైద్య బృందం అప్రమత్తమై, రోగి ఆసుపత్రికి చేరుకునేలోపే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచింది. భద్రాచలం చేరుకున్న వెంటనే వైద్యులు యువతి మెదడుకు సీటీ స్కాన్ నిర్వహించి, రక్తస్రావం లేదని నిర్ధారించారు. లక్షణాలు ప్రారంభమైన సమయం నుంచి నాలుగున్నర గంటల చికిత్సా వ్యవధి (గోల్డెన్ విండో) లోపే ఉండటంతో, అన్ని వైద్యపరమైన అర్హతలను పరిశీలించారు.

ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా..

మధ్యాహ్నం 2 గంటలకు రక్తనాళంలో ఏర్పడిన రక్తపు గడ్డను కరిగించే అత్యాధునిక ‘టెనెక్టెప్లేజ్’ ఇంజెక్షన్‌ను అందించారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.45 వేల విలువ చేసే ఈ ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం. చికిత్సకు యువతి శరీరం అద్భుతంగా స్పందించడంతో, అంతకుముందు పూర్తిగా కదలికలు లేని కుడి చేయి, కాలు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారు. ​

పక్షవాతం వచ్చినప్పుడు మొదటి నాలుగున్నర గంటల సమయాన్ని వైద్య పరిభాషలో ‘గోల్డెన్ విండో’ అంటారు. ఈ సమయంలోగా తగిన చికిత్స అందిస్తే మెదడులోని నాడీ కణాలు దెబ్బతినకుండా కాపాడటంతో పాటు శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చు. ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం జాప్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచిస్తున్నారు. ​మణుగూరు, భద్రాచలం ఆసుపత్రుల వైద్య బృందాలు, నర్సింగ్ ఇతర ఆరోగ్య సిబ్బందిని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ జి. రవి బాబు ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>