కలం, రామడుగు: చట్టాలతో బాలల భద్రతకు భరోసా చేకూరుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఎ.కిరణ్ కుమార్, పెరుక రంగయ్య, సీహెచ్.చంద్రప్రకాశ్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శివకుమార్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కే. రాణి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రామడుగు మండలం వెలిచాల (Velichala) గవర్నమెంట్, సరస్వతి హైస్కూల్లో మంగళవారం చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన ద్వారా పిల్లలు తమ హక్కులను తెలుసుకుని అన్యాయం, వేధింపులు, దోపిడీ వంటి ఘటనల నుంచి తమను తాము రక్షించుకుంటారని, చట్టాలతోనే బాలల భద్రతకు భరోసా కలుగుతుందన్నారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో యాక్ట్–2012, యాసిడ్ దాడుల బాధితులకు చట్టపరమైన రక్షణ, నల్సా ఆధ్వర్యంలోని ఎల్ఎస్యూసీ ద్వారా పిల్లలకు అందుతున్న ఉచిత న్యాయసేవలను వివరించారు.
బాలల హక్కుల పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన పిల్లలు, మహిళలు, నిరుపేదలు, ఇతర బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం, మధ్యవర్తిత్వ సేవలు, పర్మినెంట్ లోక్ అదాలత్ ద్వారా వివాద పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పిల్లలపై హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు లేదా ఇతర హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని, అవసరమైతే 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 15100 ఉచిత న్యాయ సేవల హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు.
బాలల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం విధిగా బాలల రక్షణ విధానానికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుని నిత్యం పర్యవేక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం రాజరాజేశ్వరీదేవి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పద్మలతాదేవి, టీచర్స్ పాల్గొన్నారు.

