కలం, ఖమ్మం బ్యూరో: పాల్వంచ (Palvancha) మండలం కేపీ జగన్నాధపురం పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక భావనలు సమాజంలో మానసిక ప్రశాంతతను, నూతన ఉత్తేజాన్ని నింపుతాయన్నారు. అమ్మవారి కటాక్షంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేశ్, ముత్యాల విశ్వనాథం, ఆలయ ఈవో విజయ్ కుమార్, పాల్గొన్నారు.

