కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని, డ్రైవర్ యొక్క సామాజిక బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (Deputy Transport Commissioner) డాక్టర్ ఎన్. వాణి తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాల అమలు (Bus Safety Fitness), డ్రైవర్లకు తగిన శిక్షణ కల్పించడం ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రాణ భద్రతను సమర్థవంతంగా కాపాడగలమని ఆమె పేర్కొన్నారు.
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండటం తప్పనిసరని, ఫిట్‌నెస్ లేని వాహనాలను రహదారులపై నడపడం చట్టవిరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. అలాగే కేంద్ర మోటారు వాహనాల నియమాలు 1989 ప్రకారం పాఠశాల బస్సులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు.పాఠశాల బస్సులలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు (ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు), తగిన సీటింగ్ సదుపాయం, స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఉండాలని ఆమె సూచించారు. వాహనాల బ్రేకులు, టైర్లు, స్టీరింగ్ వ్యవస్థ వంటి యాంత్రిక భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని పేర్కొన్నారు.
డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలని, రహదారి భద్రత, రక్షణాత్మక డ్రైవింగ్, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన (Bus Safety Fitness) ఉండాలని తెలిపారు. వారికి నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాల యాజమాన్యాలు వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, బీమా పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు వంటి చట్టబద్ధ పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల రవాణా భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని డాక్టర్ వాణి స్పష్టం చేశారు.
Read Also: బాక్సింగ్ వరల్డ్ నంబర్ వన్‌గా జైస్మిన్ లంబోరియా!
Follow Us On: X(Twitter)

